Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ninnu Kori Movie Review

July 7, 2017
DVV Entertainments
Nani, Nivetha Thomas; Aadhi Pinisetty, Tanikella Bharani, Maurali Sharma, Rajashree, Neetu Chandra, Bhupal Raj, Prudhvi, Kedar Shankar, Padmanja, Priyanka Naidu
Kona Venkat
Karthik Ghattamaneni
Prawin Pudi
Shiva Nirvana
Chinna
Neeraja Kona
Ramajogayya Sastry & Srijyo
Lakshman Musuluri
Satyam Guggila
Satish Dayapule
Vijay
Shiva Thurlapati
Anil Kumar Vanga
Gopi Suner
DVV Danayya
Shiva Nirvana

కోరకుండా ఉండలేం...('నిన్ను కోరి' మూవీ రివ్యూ)

ప్రేమించిన అమ్మాయి...ఇంట్లో వాళ్లని కాదనలేనంటూ...పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే ఆ ప్రేమికుడు ఏం చేయాలి...ఏం నిర్ణయం తీసుకోవాలి...ఆనాటి దేవదాసు నుంచి ఈ నాటి ఫేస్ బుక్ ప్రేమ దాసుల దాకా అదే ఇంటర్నేషనల్ సమస్య. ఈ సమస్యకు తమదైన దేశీయ,ప్రాంతీయ పరిష్కాలు కనుక్కుంటూ జీవితాన్ని లాగిస్తున్నారు ప్రేమదాసులు.

దేవదాసు అయితే జమీందారు కొడుకు కాబట్టి... పెద్దగా ఉద్యోగం,సద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కావాల్సింత డబ్బు చేతిలో ఉంటుంది కాబట్టి చలి ఉన్నా లేకపోయినా శాలువా కప్పుకుని,చక్కగా ఓ కుక్కని తోడుగా పెట్టుకుని తాగుతూ,కక్కుతూ,మధ్యమధ్యలో పార్వతిని తలుచుకుంటూ కాలక్షేపం చేసేసాడు. అలాంటి అవకాసం లేని అతి తెలివిబ్యాచ్ అయితే...ఎందుకైనా మంచిదని ప్రేమలో ఉన్నప్పుడే తమ ఫొటోలు, లవ్ లెటర్లు ఓ కాపీ తీసుకుని దాచుకుపట్టుకుని ఆమె పెళ్లయ్యాక బ్లాక్ మెయిల్స్ కార్యక్రమం పెట్టుకుని తన్నులు తినేవారు.

మరికొందరు...సర్లే పెళ్లి చేసుకుని దాని లైఫ్ అది చూసుకుంది కదా...మనమూ మన ఇంట్లో చూసిన...అంతకన్నా అందగత్తెని, డబ్బున్న అమ్మాయిని చూసుకుని పెళ్లి చూసుకుని సెటైలై బుద్ది చెప్పి పగ తీర్చుకునేవారు. ఇంకొందరు అయితే ఎలా వదిలించుకుందామా అనుకున్నాం...హమ్మయ్య దానిదారి అదిచూసుకుంది అని పార్టీ చేసుకునే వాళ్లూ ఉన్నారు.

కానీ సినిమా ప్రేమలు ఇంకొంచెం తేడా. రాధాకళ్యాణం నుంచి,అభినందన,కన్యాదానం వరకూ ఓ ట్రెండు. పెళ్లి చేసుకున్నవాడే పరమ త్యాగిలా..వీళ్ల ప్రేమని అర్దం చేసుకుని తన భార్యని ప్రేమించినవాడితో కలిపేసే పోగ్రాం పెట్టుకుని హీరో అయిపోదామని చూస్తాడు. కానీ అదీ దాటిపోయింది...క్షణంలా హీరోగా...అలా మిగలిపోయి..ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాక సమస్య వస్తే పరుగెత్తుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు నాని హీరోగా వచ్చిన 'నిన్ను కోరి' ప్రేమ ,పెళ్లి దాకా పాత కథలా సాగినా, ఇంటర్వెల్ లో కొత్త ట్విస్ట్ తో ఇంటెన్సిటీలేపింది. సెకండాఫ్ సరికొత్త సరుకుతో సూపర్ అనిపించింది. ఇంతకీ ఏమిటా కొత్త పాయింట్,ఓవరాల్ సినిమా ఎలా ఉంది...సినిమా ఫ్యామిలీతో ఈ వీకెండ్ వెళ్లి చూసేయచ్చా...అని అడుగుతున్నారా....అయితే రివ్యూ చదివేయండి.

కథేంటి...

ఆంధ్రయూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లో పీహెడీ చేస్తూండే ఉమామహేశ్వరరావు ఉరఫ్ ఉమ...అందరిలాగే పల్లవి(నివేదా)అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు.ఆ ప్రేమ ఎంత వరకూ వెళ్తుందంటే..ఆమె చూడకుండా ఉండలేక...ఆమె ఇంటి పెంటహౌస్ లోనే అద్దెకు దిగేటంత. అయితే ఉమా లాగే అతను ప్రేమించిన అమ్మాయి పల్లవికి కూడా ఫ్యామిలీ లేకపోతే ఏ సమస్యా రాకపోను.చక్కగా పెళ్లైపోనూ...మనకీ కథ పుట్టకపోను..కానీ ఆమెకు తల్లి,తండ్రి,బావ,అక్క ఉన్నారే.

పల్లవి తండ్రి (మురళిశర్మ) పక్క జెంటిల్ మ్యానే. ఆయనకు ఈ ప్రేమలు,పెళ్లిళ్లు అంటే దురభిప్రాయం ఏమీ లేదు కానీ సదభిప్రాయం కూడా ఏ మాత్రం ఉన్నట్లు తోచదు. ముద్గుగా,గారాబంగా అన్నేళ్లు పెంచుకున్న కూతుర్ని... ఏ పెంట్ హౌస్ లో అద్దెకుండో కుర్రాడో, పాలోడో వచ్చి ప్రేమించాను అంటే ఇచ్చి పెళ్లి చేసేది లేదని , మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్ లో సెటిలైన వాడితో లేచిపోయినా ఫర్వాలేదు అని అందరికీ చెప్తూంటాడు. ఈ ముక్క మనోడు ఉమా చెవిని కూడా ఓ రోజున పడింది.

దాంతో ఉమ.. ఇదెక్కడ గొడవరా దేవుడా...నాకేమో ఇంకా పీహెడీనే అవ్వలేదు..ఆయనేమో లైఫ్ లో సెటిల్ అవ్వాలని కండీషన్ పెట్టుకు కూర్చున్నాడు అని మధన పెడుతూంటూడు. ఇవన్ని పట్టించుకోకుండా... పల్లవికి ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు..ఏదొకటి చేయి అని పోరుపెడుతూంటుంది. అంతేకాకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామని ఉమపై ఒత్తిడి చేస్తుంది. కానీ అప్పటికే ఆమె తండ్రి చెప్పిన మాటలు విని ఉండటం చేత, వాటిని నమ్మటం చేత..., పోషించే శక్తి లేనప్పుడు అలా వెళ్లిపోవడం భావ్యం కాదని ఆమెకు నచ్చచెప్తాడు. అంతేకాకుండా ఈ లోగా ...డిల్లీలో పీహెచ్ డీ చేసే ఆఫర్ రావటంతో... ఏడాదిలో వచ్చేస్తానని చెప్పివెళ్లిపోతాడు ఉమ.

ఇదంతా చూసిన పల్లవి ఆలోచనలో పడిపోతుంది. మనం పెళ్లి చేసుకుందాం....అంటూ ఒత్తిడి పెడితే..రేపు నువ్వే నా కెరీర్ ని పాడు చేసావు అని ఉమ భవిష్యత్ లో అంటాడని ...ఇంట్లో వాళ్లు చూసిన అరుణ్‌ ని ఓకే చేసేసి... (అరుణ్ ..ఆది పినిశెట్టేకదా..బాగున్నాడు..కాదనటం ఎందుకు...ఏ గుండు హనుమంతరావు లాంటివాడితో పెళ్లి అంటే వద్దనేదేమో) పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది పల్లవి.

ఆ తర్వాత ఉమకి విషయం తెలిసి ప్రేమ సాంప్రదాయం ప్రకారం... గెడ్డం పెంచి, మందు కొడుతూ దేవదాసు గా గెటప్ ఛేంజ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకుని ఉమని బాధపడి...ఉమలో మార్పు తేవటం కోసం అతన్ని కలిసి ఓ చిత్రమైన ఎగ్రిమెంట్ కు ఒప్పిస్తుంది. ఆ ఎగ్రిమంట్ ప్రకారం..ఉమ...ఆమె ఇంట్లో భర్తతో పాటే ఉండాల్సి వస్తుంది. అప్పుడేం జరుగుతుంది. ఆ ఎగ్రిమెంట్ ఏమిటి.. వాళ్లిద్దరి కాపురంలో చిచ్చు పెడతాడా..ఉమ తిరిగి మామూలు మనిషి అవుతాడా...పల్లవి ని పెళ్లి చేసుకున్న అరుణ్ ఏమంటాడు, ఉమ-పల్లవిలు ఒక్కటయ్యారా? లేక అరుణ్‌-పల్లవిల పెళ్లి బంధమే కొనసాగిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింది.

కథ,కథనం ఎలా ఉన్నాయంటే...

ఈ మధ్యకాలంలో తన కథలు,స్క్రీన్ ప్లేలతో భయపెట్టిన కోన వెంకట్ ఈ సినిమాకు చక్కటి స్క్రీన్ ప్లే అందించారని మనం సెకండాఫ్ చూసేటప్పుడు మెచ్చుకుంటాం. ఫస్టాఫ్ సెటప్ రొటీన్ గా సాగినా ఇంటర్వెల్ లో కథలో కిక్ తెచ్చారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సెకండాఫ్ ట్రీట్ మెంట్ సాగింది కానీ చాలా ప్లాట్ గా ఉన్నట్లు అనిపించింది. డైలాగులు కూడా కథకు తగ్గట్లే క్యారక్టర్స్ అనుగుణంగా సాగాయి. ఎక్కడా ఓవర్ అనిపించలేదు. కథలో కొత్త పాయింటే సినిమాకు కొత్త దనం తెచ్చింది. అందుకు కథ రాసుకున్న దర్శకుడుని మెచ్చుకోవాలి. చాలా సీన్స్ లో కంటెంట్ రిపీట్ అయినా ఆ తేడా తెలియనివ్వలేదు.

క్లైమాక్స్ ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. అలా వచ్చి..ఇలా వెళ్లిపోయిన ఫీల్ వచ్చింది. సినిమా మొత్తం జరిగిన ఎమోషన్ జర్నికి తగినట్లుగా క్లైమాక్స్ జస్టిఫై చేయలేదు.

కొత్త డైరక్టర్ ఎలా చేసారంటే...

దర్శకుడుగా శివ నిర్వాణ చక్కటి క్లీన్ ఫిల్మ్ ని అందించారు. ఎక్కడా అతి లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో ఏవేవో ట్రాక్ లు కామెడీలు,ఫైట్స్ పెట్టేయకుండా సినిమాను ఇంట్రస్టింగ్ గా నడిపారు. కథలోంచే డైలాగు కామెడీ,సిట్యువేషన్ కామెడీ తెచ్చే ప్రయత్నం చేసారు కానీ నాని సినిమా కదా..కామెడీ ఉండాలి అని కంగాళి చేసేయలేదు. అలాగే మేకింగ్ స్టైయిల్ కూడా నీట్ గా చక్కగా ఉంది. ఎమోషన్స్ ని బాగా రిజిస్టర్ చేసారు.

ఆ ఒక్కటే చిరాకు

లవ్ స్టోరీ కదా స్లో పేసెడ్ గా నడవాలి అనుకున్నారో ఏమో కానీ స్లోగా నడుస్తూంటాయి సీన్స్. ఒక్కోసారి అంత స్లో చూస్తూంటే చిరాకు వస్తుంది. అయితే నాని ఫెరఫార్మెన్స్ తో రక్షించాడు. అలాగే సినిమాకి ప్రాణం గా నిలవాల్సిన ఉమ,పల్లవి ల లవ్ సీన్స్ మరింత బాగా డిజైన్ చేయాల్సింది. ఎందుకంటే సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలన్నిటికి ఆ లవ్ స్టోరీనే కీలకం కాబట్టి. అవి మరీ లైటర్ వీన్ లో లాగేసారు.

మాంగల్య బలం

ప్రేమించిన అమ్మాయిని ఇంకొక‌రు పెళ్లి చేసుకోవ‌డం.. ప్రేమికుడు వెనకబడ్డా... ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి చివ‌రికి భ‌ర్త‌ వైపే మొగ్గుతుంద‌నే మాంగల్యబలం సీన్స్ నాగయ్యగారి కాలం నుంచి చూస్తున్నాం...సినిమా అంతా అయ్యాక...మళ్లీ అదే చూసామే అనిపించకుండా ఉంటే బాగుండేది.

కొత్తగా చెప్పుకునేదేముంది బాస్

నాని గురించి కొత్తగా చెప్పుకునేదేముంది..న్యాచురల్ స్టార్ నాని అనే పదాన్ని నిజం చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో నట విశ్వరూపం చూపించాడు. కమల్ హాసన్ కనిపించాడు.

హీరోయిన్, మిగతావాళ్లూ

హీరోయిన్ నివేతా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు జీవితంలో నష్టపోకూడదని తపనపడే ప్రేయసిగా, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నోప్పించకూడదు అని ఆలోచించే భార్యగా తన నటనతో నానితో పోటీపడింది. అలాగే సినిమాలో మరో కీ రోల్ చేసిన ఆది కూడా సహజంగా నటించాడు. హీరోయిన్ తండ్రిపాత్రిలో మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు, మిత్రుల పాత్రల్లో సుదర్శన్‌, విద్యుల్లేఖరామన్‌ కథలో కలిసిపోయి నవ్విస్తూ...మంచి రిలీఫ్ ఇచ్చారు.

టెక్నికల్ లాగ...

ఈ సినిమా హైలెట్ లలో ... కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఒకటి. అమెరికాని అదిరిపోయే రీతిలో అద్బుతంగా చూపించి, సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాడు. గోపి సుందర్ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ చాలా షార్ప్ గా బాగుంది. డి. వి. వి దానయ్య నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

ఫైనల్ గా

ఈ సినిమాలో కంటెంట్ ప్రేమలో ఫెయిలైన చాలా మందిని కనెక్ట్ చేస్తుంది. ఎక్కువ శాతం వాళ్లే ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాసం ఉంది. అయితే నాని సినిమా అంటే ఫక్తు కామెడీ అనుకుని వెళ్లేవారికి పొరపాటున కూడా నచ్చదు. ఫ్యామిలీలకు వీకెండ్ లో మంచి ఆప్షన్ మిస్ కావద్దు.

ADVERTISEMENT
ADVERTISEMENT