Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Angel Movie Review

November 3, 2017
Sri Saraswati Films
Naga Anvesh, Hebah Patel, Suman, Sapthagiri, Pradeep Rawat, Priyadarshi, Prabhas Srinu, Sana and Shayaji Shinde
Srinivas Lankapalli
VS Saimani
Ram-Lakshman
Vempalli Ramesh Reddy
Chota K Naidu
Guna
Bheems Ceciroleo
Bhuvan Sagar
‘Baahubali’ Palani

ఆల్ ఈజ్ వెల్ ..బట్ ('ఏంజెల్‌' రివ్యూ)

హఠాత్తుగా ఓ రోజున ఓ అమ్మాయి వచ్చి మన ఎదురుగా నిలబడి.. ఒరే అబ్బాయి....నేనో స్వర్గలోక కన్యని, నాకు ఆ వెధవ స్వర్గం లోకం అంటే బోర్ కొట్టేసింది...కష్టం లేని సుఖాలు అనుభవించటం చాలా చాలా కష్టంగా ఉంది, అందుకే భాధపడిపోయి భూలోకం కు వచ్చేసా అని చెప్పితే...వినేవాడుకి ఏమనిపిస్తుంది..ఎవరీ మాలోకం...మేకప్ లేని డ్రామా హీరోయిన్ లా డైలాగులు చెప్తోంది అని మొదట ఆశ్చర్యపోతాడు..ఆ తర్వాత ..తన చెవుల్లో పూలు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుక్కుంటాడు. అప్పటికీ తేలకపోతే... ఈ రోజుల్లో డ్రామాలు కూడా ఆడేవాళ్లు పెద్దగా లేరే..పొరపాటున ఆమె సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ ..సరైన ఆఫర్స్ లేక,ప్రస్టేషన్ లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, మెంటలెత్తి తిరుగుతోందేమో అనుకుంటాం.. కొంచెం అటూ ఇటూ గా ...ఏంజిల్ సినిమాలో హీరోకు అదే డౌట్ వచ్చింది. అలాగని వదిలేసి వెళ్లిపోదామా అంటే...తనకు పరిచయమైంది..అలాంటి ఇలాంటి అమ్మాయి కాదే.. కుమారి 21 ఎఫ్ లాంటి కత్తిలాంటి కుమారి. అందుకే ఫాలో అయిపోయాడు...ఫీలై పోయాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడు ...ఇతనేం చేస్తూంటాడు , ఏంజిల్ ని చెప్పుకునే ఆమె నిజంగా స్వర్గ లోక వాసేనా, ఇంతకీ ఈ సినిమా కథేంటి..వర్కవుట్ అవుతుందా..వంటి విషయాలు తెలియాలంటే అంటే...రివ్యూ చదవండి

కథేంటి..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం జరుగుతున్న తవ్వకాల్లో ఓ అరుదైన విగ్రహం బయట పడుతుంది. అది సువర్ణ సందరిలాంటి అందమైన అమ్మాయి విగ్రహం. ఆ విగ్రహాన్ని ఓ బిజినెస్ మ్యాన్ (షాయీజి షిండే) మూడు కోట్లకు కొంటాడు. దాన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ తరలించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి... ఆ పనిచేయగల సమర్దుడు కోసం వెతుకుతూంటే... మన హీరో నాని(నాగ అన్వేష్‌) గురించి తెలుస్తుంది. ఆ బాధ్యతని భుజాన వేసుకున్న నాని, తన ఫ్రెండ్ సప్తగిరి తో కలిసి ఓ అంబులెన్స్‌లో విగ్రహం పెట్టుకుని హైదరాబాద్‌ బయల్దేరతారు. మార్గమధ్యంలో టైర్‌ పంక్చర్‌ అవ్వటంతో గ్యాప్ దొరికింది కదా ప్రెండ్స్ ఇద్దరూ తలో పెగ్గేసి పడుకుంటారు. ప్రొద్దున్నే లేచి చూస్తే విగ్రహం గాయబ్. ఏం చేయాలో అర్దం కాదు. దాంతో చేసేది లేక ఖాళీగానే హైదరాబాద్‌ బయల్దేరిన వారికి దారిలో నక్షత్ర(హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. హైదరాబాద్‌ వరకు లిఫ్ట్‌ కావాలని అడగడంతో తమ వ్యాన్‌ ఎక్కించుకుంటారు.

ఇంతకీ ఈ నక్షిత్ర పాప ఎవరూ అంటే..ఆమె గంధర్వరాజు(సుమన్) కుమార్తె. స్వర్గంలో ఉండే ఆమె కాస్త డిఫరెంట్ ధాట్స్ ఉన్న పాప అన్నమాట. ఆమె అక్కడ సంతోషాలనే అనుభవిస్తూ విసుగు ఫీల్ అవుతూంటుంది. దానికి తోడు నారదుడు కూడా భూమి గురించి కాస్తంత ఓవర్ బిల్డప్ ఇస్తాడన్నమాట. పబ్ లు, నైట్ క్లబ్ లు అంటూ ఆమెను ఊరిస్తాడు. దాంతో భూమి మీద విభిన్న అనుభవాల్ని రుచి చూడాలని.. సామాన్య మానవురాలిగా జీవితం గడపాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రుల మాటను కూడా జవదాటి భూలోకానికి వచ్చేస్తుంది. అంటే నక్షత్రే ఆ గంధర్వ కన్య.

తనకు పరిచయమైన నక్షత్రను కొంతమంది లోకల్ రేపిస్ట్ ల నుంచి కాపాడతాడు నాని. దాంతో తెలుగు సినిమా హీరోయిన్ లా ..ఆ ఫైటింగ్ చూసి ముచ్చటపడి ఓ పాటేసుకుంటుంది ఈ గంధర్వ కన్య. ఈ లోగా తాము డబ్బు పోసి కొనుక్కున్న విగ్రహం కోసం ..షాయీజీ షిండే మనుష్యులు హీరో వెంటపడుతూంటారు. దాంతో వేరే దారిలేక.. నక్షత్రను తీసుకుని పారిపోతాడు. అలా ఓ ఊరికి చేరిన వాళ్లు షాక్ అవుతారు. ఎందుకంటే.....అక్కడ నక్షత్ర ఫొటో పోస్టర్ లా పెట్టి..కనపడుట లేదు అని రాసి ఉంటుంది. ఇంతకీ నక్షిత్ర మొదట చెప్పినట్లుగా గంధర్వ కన్య కాదా... ఆమె గంధర్వ కన్య అయితే ... ఆమె ఫొటో కనపడుట లేదు అని పోస్టర్స్ ఎందుకు వేసారు. అసలు ఏంజిల్ కథేంటి...ఆమెతో ప్రేమలో పడ్డ హీరో పరిస్దితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

గొప్ప విషయమే

సినిమా కథ మొత్తం ...హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజానికి హీరో సొంత సినిమా(తమ సొంత బ్యానర్) అయినా...హీరోయిన్ పాత్రకు ప్రయారిటి ఇచ్చి కథకే విలువ ఇవ్వటం గొప్ప విషయమే. అలాగే సినిమా థ్రూ అవుట్...సెకండ్ హీరోలా అనిపించేలా కమిడియన్ సప్తగిరిమీద సీన్స్ డిజైన్ చేసారు. సోలోగా మొత్తం నేనే అనకుండా ఈ విషయంలో హిరో కాన్ఫిడన్స్ ని చూపించాడు.

కుర్రాడెలా చేసాడు

ఇక హీరో నాగ అన్వేష్‌ తొలి చిత్రానికి దీనికి సంభంధం లేదు అన్న రీతిలో కొత్తగా కనిపించాడు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో మంచి ఈజ్‌ తో దూసుకుపోయాడు. కాస్త కష్టమనిపించే ... సెంటిమెంట్‌ సీన్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో ఫెరఫెక్ట్ గా ఎక్సప్రెషన్స్ చూపించాడు. అతని కామెడీ టైమింగ్‌ కూడా బాగుంది.

కొత్త డైరక్టర్..పాత ఆలోచన

ఇక ఈ చిత్రం దర్శకుడు మాత్రం తన తొలి చిత్రం కోసం ఇలాంటి నలిగిపోయిన కథ ఎంచుకోవటం ఆశ్చర్యమనిపిస్తుంది. అలాగే , స్టోరీ లైన్ కు తగ్గ రీతిలో ట్రీట్మెంట్ చెయ్యలేకపోయారు. రాజమౌళి శిష్యుడైనా..ఆయన సినిమాల్లో కనిపించేలా.. ఓ స్ట్రాంగ్ విలన్ పాత్రను మాత్రం ఈ సినిమాలో క్రియేట్ చేయలేదు. కాసేపు షాయాజీ షిండే మరికాసేపు ప్రదీప్ రావత్, ఇంకాసేపు...కబీర్ సింగ్ కనపడతారు. దాంతో విలన్ ట్రాక్ ఫన్ గా తయారైంది. ఎక్కడా సీరియస్ గా లేకుండా పోయింది.

టెక్నికల్ గా...

సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి. నేపధ్య సంగీతం సోసోగా ఉంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫర్ కొన్ని సీన్స్ లో తన ప్రతిభ ఏంటనేది చూపించారు. ఎత్నిక్ క్రియేటివ్ స్టూడియోస్ వారి సీజీ వర్క్ బాగుంది.ఓవరాల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫైనల్ థాట్

కథలో కాస్తంత హీరోకు కూడా ప్రయారిటి ఇచ్చి ఉంటే...ఖచ్చితంగా వంద రోజుల బొమ్మ అయ్యేది

ఏమి బాగుంది: లెంగ్త్ తక్కువ ఉండటం, మెడికో గా ప్రియదర్శన్ చేసిన కామెడీ

ఏం బాగోలేదు: సినిమాకు సరైన విలన్ లేకపోవటం

ఎప్పుడు విసుగెత్తింది : స్వర్గంలో హీరోయిన్ ద్విపాత్రాభినయంకు చెందిన సీన్స్ వచ్చినప్పుడు

చూడచ్చా ?: సప్తగిరి, ప్రభాస్ శీను, ప్రియదర్శని కామెడీ కోసం చూడచ్చు. హెబ్బా పటేల్ అభిమానులూ నిరాశపడరు.