కొత్త కథా వీక్షణం ('ఒక్క క్షణం' మూవీ రివ్యూ)
ఒకే పోలికలతో ఉండే కథలు తెలుగు సినిమా పరిశ్రమలో బోలెడు ఉన్నట్లు...."ఒకేపోలికలతో ఉండే మనుష్యులు ప్రపంచం మొత్తం మీద ఏడుగురు ఉంటారట". ఇందులో నిజమెంత ఉందో కానీ ఈ పాయింట్ ని పట్టుకుని మన సినిమా వాళ్లు ఇన్నాళ్లూ డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్ కథలు తయారు చేసి చెడుగుడు ఆడేసారు..ఆడేస్తున్నారు. రాముడు-భీముడు కాలం నాటి నుంచి వస్తున్న ఆ కథలు పాత పడిపోయాయి. కొత్తదనం కావాలి....దాంతో రూపంలో ఒకే పోలికలతో ఉన్న మనుష్యులు ఉన్నట్లే..ఒకే విధమైన జీవితాలు ఉండే (సమాంతర జీవితాలు గల) వ్యక్తులు ఉండరా అని ... ఆ టైప్ కథలను వెతికి వర్కవుట్ చేసారు.
అంటే...ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో...అదే సేమ్ టు సేమ్ ..ఆ వ్యక్తికి సంభందంలేని మరో వ్యక్తి జీవితంలో పొల్లుపోకుండా జరగటం అన్నమాట.(నిజానికి ...తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా టైప్.. బ్యాచ్ జీవితాలు..దినచర్య తో సహా.. ఒకేలా ఉంటాయి... .వాళ్ల గురించి కాదు).
ఇలా మన కథలకు పనికొచ్చే సమాంతర జీవితాలు అప్పుడెప్పుడో అమెరికాలో అక్కడ అధ్యక్ష్యులు జాన్ కెన్నడి, అబ్రహం లింకన్ లైఫ్ లో జరిగిందట. ఇద్దరు లైఫ్ లు ఒకే విధంగా సాగాయట. దాంతో ఉత్సాహంగా ఆ పాయింట్ ని తీసుకుని కొరియావంటి దేశాల్లో వాటిని తెరకెక్కించేసారు. అయితే మనకు ఇక్కడెవరూ ధైర్యం చేయలేదు.
ఏమో పారలల్ లైఫ్ సినిమాలు...మనలాంటి తెలివైన వాళ్లకే అర్దం కావటం కష్టంగా ఉందే...అలాంటిది అఫ్ట్రాల్ ..మనం తీసే సినిమాలు చూసి ..ఆనందపడుతూ..అవే అద్బుతమని పొడుగుతూ జీవించే జనాలకు ఏం అర్దం అవుతాయి...అని దర్శక,నిర్మాతలు దూరం పెడుతూ వచ్చారు. కానీ దర్శకుడు వి ఐ ఆనంద్ కి కాస్త ప్రేక్షకుల అభిరుచుల మీద..వారి ఇంటిలిజెన్స్ మీద వేరే అభిప్రాయం,నమ్మకం ఉన్నట్లున్నాయి. దాంతో ఈ కథను రెడీ చేసి వదిలాడు.
ఇంతకీ దర్శకుడు మనపై పెట్టుకున్న నమ్మకం నిజమేనా...ఈ సినిమా హలో బ్రదర్ టైప్ కథలంత ఈజీగా మనకు అర్దమవుతుందా..అసలు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్న ఈ చిత్రంలో కథేంటి.. నమ్మి చేసిన అల్లు శిరీష్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందా..లేక బాకీ పడుతుందా... కొరియా చిత్రం కాపీ అంటూ మీడియాలో వచ్చిన వార్తలలో నిజమెంత..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
ఇదండీ కథ
జ్యోత్స్న(సురభి)...కు ఓ అలవాటు. తమ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న శ్రీనివాస్(అవసరాల శ్రీనివాస్), స్వాతి(సీరత్ కపూర్)ల ఇంటిపై ఓ కన్నేసి కాలక్షేపం చేయటం. అదే కొంపముంచుతుందని ఆమె కు తెలియదు. ఆ అలవాటులో భాగంగా శ్రీనివాస్, స్వాతి మధ్య మధ్య జరిగే గొడవలు రోజూ గమనిస్తుంది. అలా చూడగా చూడగా...కొన్నాళ్లకు క్యూరియాసిటీ పెరిగిపోయి....వారి గొడవలకు కారణం ఏంటి? ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అనే కనుక్కోకోవాలనే నిర్ణయానికి వస్తుంది.తెలుసుకోకపోతే ఉండలేని స్దితికి వస్తుంది.
దాంతో ఈ విషయాన్ని తన లవర్ జీవా(అల్లు శీరిష్) కు షేర్ చేసుకుంటుంది. సర్లే తన లవర్ విషయం తన స్వ విషయం లాంటిది కాదా ... అంటూ కూపీ లాగుదామని రంగంలోకి దిగిన జీవాకు ...శ్రీనివాస్ ఫ్యామిలీకి సంభందించిన కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అక్కడితే ఆగితే బాగుండును.. శ్రీనివాస్ జీవితంలో ఏమైతే జరుగుతోందో.. అదే జీవా జీవితంలోనూ జరుగుతూండటం గమనిస్తాడు. అంతేకాకుండా..శ్రీనివాస్ భార్య... స్వాతికి ఎదురయ్యే పరిస్థితులు జ్యోత్స్నకూ ఎదురవుతూండటం చూసి అదిరిపడతాడు.
స్వాతి-శ్రీనివాస్‌ల గతం.. జీవా-జ్యోత్స్నలకు వర్తమానంలా మారి జరుగుతూంటుంది. ఇదంతా పారలల్ లైఫ్ అనే విధికు సంభందించిన ప్రాజెక్టు అని, అది తమ మీద ప్రయోగింపబడుతోందని అర్దం చేసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకుని కాన్సెప్టుని అర్దం చేసుకునే లోగా ఓ రోజు స్వాతి మర్డర్ కు గురి అవుతుంది. శ్రీనివాస్ ...జైలుకు వెళ్తాడు.
దాంతో జ్యోత్స్న, జీవాలు ఇద్దరికీ గుండెళ్లో రాళ్లు పడతాయి. అప్పటివరకూ శ్రీను-స్వాతిల జీవితంలో జరిగినవి అన్ని తమ జీవితంలోనూ యధావిధిగా జరిగినట్లే..ఈ మర్డర్ కూడా ఖచ్చితంగా జరుగుతుందని భయం పట్టుకుంటుంది. దాంతో అతనో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తనను, తన లవర్ జ్యోత్స్నను రక్షించుకోవాలనుకుంటాడు. ఇంతకీ జీవా తీసుకున్న నిర్ణయం ఏమిటి... తన లవర్ ని ఎలా సేవ్ చేసుకోగలిగాడు..విధిని ఎలా దాటగలిగాడు..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం.
సమాంతర జీవితాలు (పారలల్ లైఫ్) అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్టుతో ఈ చిత్రం దర్శకుడు ముందుకు వచ్చాడు. అయితే ఎంత గొప్ప కాన్సెప్టు అయినా అంతే గొప్పగా జనాలకి అర్దమయ్యేలా ఎగ్జిక్యూట్ చెయ్యకపోతే ..ఎగరేసి తంతుంది. అయితే పారలల్ కాన్సెప్టుతో వచ్చిన వి ఐ ఆనంద్ మాత్రం ..అరటిపండు వలిచి,నోట్లే పెట్టినంత ఈజిగా ఈ కాన్సెప్టుని చూసేవాళ్ల బుర్రలోకి ఎక్కించాడు. అక్కడవరకూ సక్ససే..అయితే ఆ కాన్సెప్టుని బుర్రలోకి ఎక్కించటానికే..బోలెడు టైమ్ పట్టింది.
అంటే దాదాపుగా ...ఇంటర్వెల్ వచ్చేసింది. దాంతో ఫస్టాఫ్ లో పెద్దగా ఏమీ జరగక, సాగినట్లుగా,స్లో గా జరిగిన ఫీలింగ్ వచ్చేసింది. ఇక సెకండాఫ్ థ్రిల్లర్ మోడ్ లో సాగింది. అయితే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ మీదకన్నా ఎక్కువ ఎమోషన్స్ మీద దృష్టి ఎక్కువపెట్టారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూస్తూంటే ఏదో తమిళ సినిమా చూస్తున్నట్లుగా అతిగా అనిపించాయి.
అయితే ..ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సెకండాఫ్ మీద బాగా క్యూరియాసిటీ క్రియేట్ చేసిందిది. అలాగే సెకండాఫ్ లో మెల్లిమెల్లిగా కథ ఒక్కో పొరా విడుతూ.. రివీల్ అయ్యే విషయాలు, హీరో వాటిని కనిపెడుతూ ముందుకు వెళ్లడం ఉత్కంఠను కలిగించింది. హీరో శిరీష్ పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పరిణితిని కనబర్చారనే చెప్పాలి.
టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే...
మణిశర్మ పాటలు పెద్ద గొప్పగా లేవు. కానీ ఎప్పటిలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టింది. కెమెరా పనితనం, సంభాషణలు బాగున్నాయి.
వాస్తవానికి డైరక్టర్ చెప్పదలచుకున్న పాయింట్ కొత్తది. అయితే దాన్ని పాత పద్ధతిలో చూపించడమే అసలు బాగోలేదు. ముఖ్యంగా పారలల్ లైఫ్ అనే అంశం చుట్టూ కథని డెప్త్ గా వెళ్లకపోవటం నిరాశకలిగించింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పారలల్ స్టోరీ
అవునన్నా..కాదన్నా ఈ సినిమా 2010 లో వచ్చిన Parallel Life అనే కొరియా సినిమా నుంచి ప్రేరణ పొందినట్లే అని అర్దమవుతుంది. అయితే ఆ కథ వేరు..ఈ కథ వేరు. కానీ కాన్సెప్టు ఒకటే...దాన్ని మన నేటివిటికి మన ప్రేక్షకుల స్దాయికి పూర్తిగా మార్చి తీసుకువచ్చాడు దర్శకుడు. అప్పటికీ ఒప్పుకోనంటే... ఇదో పారలల్ స్టోరీ థాట్ అనాలి. అంతకు మించి వేరే దారి లేదు.
ఫైనల్ థాట్
ఏ శుక్రవారం థియోటర్ లోకి వెళ్లి సినిమా చూసినా ...
ఏమున్నది ఆనందకారణం
తెలుగు సినిమా సమస్తం..
రొటీన్ పీడా పరాయణం అన్నట్లుగా తయారైంది
అయితే ఈ రొటీన్ ని తమ కొత్త కాన్సెప్టులతో కొందరు బ్రేక్ చేద్దామని చూస్తున్నారు. వాళ్లకు ప్రేక్షకులు హౌస్ ఫుల్స్ చేసి బ్రేక్ ఇస్తే బ్రేకులు లేకుండా దూసుకుపోతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే... రొటీన్ బ్రేక్ చేద్దామని వచ్చిన ఇలాంటి సినిమాలు చూడటానికి 'ప్రేక్షకులు కావలెను' అనే బోర్డు పెట్టకుండా చూడాల్సిన భాధ్యత మనందరిది.