అరవ 'గ్యాంగ్' కానీ... (రివ్యూ)
'యముడు'(సింగం) చిత్రం ఘన విజయం తర్వాత తమిళ హీరో సూర్య కు తెలుగులో సీన్ మారిపోయింది. తెలుగులో అభిమాన సంఘాలు పెట్టి, కౌటౌట్ లు కట్టి, పాలాభిషేకాలు చేసే పరిస్దితి వచ్చింది. దాంతో అడపదడపా ఎప్పుడో గుర్తు ఉన్నప్పుడు చేసే శాటిలైట్ డబ్బింగ్ సినిమాలు కాకుండా తెలుగులో స్టైయిట్ గా విడుదల చేసే స్దాయికు సూర్య ఎదిగారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొద్దిరోజుల్లోనే పరిస్దితి తారుమారైంది. వరస ఫ్లాప్ సునామిలో అప్పటిదాకా వచ్చిన క్రేజ్ మొత్తం కొట్టుకుపోయింది. ఎంతలా అంటే ..ఈ రోజున తెలుగులో సూర్య సినిమాకు ఓపినింగ్స్ కు జనాన్ని వెతుక్కునే పరిస్దితి వచ్చేసింది.
అయితే లేచినవాడు పడినట్లుగా... పడిన వాడు ఖచ్చితంగా ఎప్పటికైనా లేవకపోడు అని సిద్దాంతం నమ్మినట్లుగా సూర్య సినిమాలను కొని ఇక్కడ డబ్బింగ్ నిర్మాతలు లాటరీ తీస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయ పరిస్దితుల్లో సూర్య తాజా చిత్రం ‘తానే సేంద కూట్టం’ తెలుగు వెర్షన్ ‘గ్యాంగ్’ సంక్రాంతి సీజన్లో మన పెద్ద హీరోల సినిమాలకు పోటీగా మన ముందుకు వదిలారు. పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సూర్య కు ఈ సినిమా ఎంతో కీలకం. ఈ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగులో మళ్లీ ఫాలోయింగ్ వచ్చిందా...అసలు 'గ్యాంగ్' కథేంటి, రమ్యకృష్ణ పాత్రేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఈ కథ 1980ల్లో జరుగుతుంది. అప్పట్లో ..ఆకలిరాజ్యం వంటి సినిమాలు వచ్చి ఆడుతూ...నిరుద్యోగ పర్వం తో భారతదేశం బాధపడుతున్న రోజులు. ఆ రోజుల్లో తిలక్ (సూర్య) అనే కుర్రాడి కథ. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా అల్లిన కథ ఇది.
తండ్రి ప్యూన్ గా పనిచేసే సీబీఐ ఆఫీస్ లో ఆఫీసర్ గా జాబ్ సంపాదించాలనేది తిలక్ (సూర్య) జీవితాశయం. అయితే మీ నాన్న...మా ఆపీస్ లో ప్యూన్ గా చేస్తున్నాడు కాబట్టి...అలాంటి వాడి కొడుక్కి జాబ్ ఇస్తే ...నువ్వు మా ప్రక్కన సమానంగా వచ్చి కూర్చుంటావు... ఆయన సర్వీస్‌లో పోతే అదే ఉద్యోగం నీకు వస్తుంది? అది చేయ్''అని వెటకారం ఆడి ఉద్యోగం ఇవ్కకుండా ప్రక్కన పెట్టేస్తారు. (ఉద్యోగం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు...అలా వెటకారం చెయ్యకుండా ఉండాల్సింది. అలా మాట్లాడబట్టి మనోడులో అంత ఫైర్ పుట్టి..ఈ సినిమా కథ పుట్టింది ..అంటే నిజానికి ఇందులో విలన్ ..అలా నోటికొచ్చినట్లు వాగిన పై ఆఫీసర్ నోటి దూల...నాలుక అని చెప్పాలి).
అదే సమయంలో తన స్నేహితుడు తన చదువుకు సరైన జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ సంఘటన తరువాత చలించిపోయిన తిలక్ .. వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన దుస్థితి మరెవరికి జరగరాదని ,ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. తన ఆలోచనలన్ని ఉపయోగించి ఓ స్కెచ్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం.. తనలా రకరకాల కారణాలతో ఉద్యోగం రాని ...బ్యాచ్ ని చేరదీస్తాడు. వారితో ఓ గ్యాంగ్ (రమ్యకృష్ణ, సెంథిల్, శివ శంకర్ మాస్టర్ తదితరులు) చేసి నకిలీ సిబీఐ ఆఫీసర్స్ అని పేరు చెప్పి మోసాలు చేయటం మొదలెడతాడు.
తెలివిగా దోపిడీలు చేయటం మొదలెడతాడు. కొద్ది రోజులకు ఈ టీమ్ పాపులర్ అయిపోతుంది. కానీ వాళ్లు దెబ్బ కొట్టేది అవినీతి పరులనే కాబట్టి..ఎవరూ తమ డబ్బులు దోచుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వరు. దాంతో వీళ్లపై కంప్లైంట్స్ ఉండవు. అయితే కొద్ది రోజులుకు సీబీఐ కు ఈ విషయం తెలుస్తుంది. దాంతో ఈ నకిలీలను ఏరి పారేయాలనుకుంటారు. అయితే వాళ్ల వల్ల కాదు. ఆ సమయంలో శివశంకర్ (కార్తీక్) అనే అధికారి రంగంలోకి దిగుతాడు. మరి అతను ఈ గ్యాంగుని పట్టుకోవడానికి ఎలాంటి ప్లాన్ లు రచించాడు.. తిలక్ టీమ్ వాటిని ఎలా ఎదుర్కొంది. అంతిమంగా ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా కథ.
రీమేక్ తోనే రచ్చ
బాలీవుడ్ లో కొన్నేళ్ల కిందట అక్షయ్ కుమార్ హీరోగా వచ్చి సూపర్ హిట్టయిన ‘స్పెషల్ చబ్బీస్’కు అఫీషియల్ రీమేక్ ‘గ్యాంగ్’. ఐతే ఒరిజనల్ కు ఈ సినిమాకు స్టోరీ లైన్ తో తప్ప సంభంధం ఉండదు. అంతలా ఇంప్రవైజ్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా హిందీ సినిమా సీరియస్ గా సాగితే తెలుగుకు వచ్చేసరికి ..పూర్తి ఫన్ తో ఫిల్ చేసారు. అలాగే సూర్య ఫ్యాన్స్ ని అలరించేలా మాస్,మసాలాని అద్దారు. అయితే ఇలా మార్పులు చేర్పులు చేసినప్పుడు ఒరిజనల్ సినిమాలోని విషయం లో ఉన్న ఇంటెన్సిటీ, థ్రిల్ తగ్గుతాయి. అదే ఈ సినిమాకు జరిగింది. అయితే ఆ లోటు కనపించకుండా దర్శకుడు స్పీడుగా కథ,కథనాన్ని నడిపారు.
అయితే ఎన్ని మార్పులు చేసినా, ఎంత ఫన్ గా నడిపినా ఓకే కానీ సినిమాలోని ఎమోషన్ కోషియెంట్ ని మాత్రం మిస్ చేయకూడదు. కానీ దర్శకుడు విఘ్నేష్ ఆ విషయంలో ఎందుకనో పట్టు విడిచారు. దాంతో సినిమాలో ఎక్కడా సీరియస్ నెస్ లేకుండా పోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇక సినిమా ముగించెయ్యాలి అని అర్జెంటుగా మెడ మీద కత్తి పెట్టి ముగించినట్లు గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆపోజిట్ ఫోర్స్ కథలో ఫెరఫెక్ట్ గా కుదరలేదు. హిందీలో సినిమా చూస్తూంటే మన కళ్లదెరుగా జరిగినట్లు అనిపిస్తే..ఇక్కడ ఏదో కామెడీ సినిమా చూస్తున్నట్లు..అనిపిస్తుంది. ఇలాంటి కథలకు మరీ అంత కామెడీ చొప్పించకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీరియస్ డ్రామా కూడా తేలిపోయింది.
ఎవరెలా చేసారు...
సూర్య లో నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకునే దేమీ లేదు. అలాగే రమ్యకృష్ణ గురించి కూడా. ఇద్దరూ పోటీ పడి నటించారు. హీరోయిన్ కీర్తి సురేష్ చేయటానికి ఏమీ లేదు. మిగతా తమిళనటీనటులు రొటీన్ గా చేసుకుంటూ పోయారు.
తమిళ సాంబారే
దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన తమిళ నెటివిటీకి తగినట్టు కథను రాసుకున్నాడు. దాంతో ఓ తమిళ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే నేటివిటి లేదు. అయితే తెలుగు డబ్బింగ్ రైటర్ మాత్రం న్యాయం చేసారు. 'ఒక్కడు కోటీశ్వరుడు అవడానికి కోటి మంది చావాల్సి వస్తోంది. మొత్తం తవ్వి బయటికి తీస్తే మన దేశంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్‌ని ఈకల్లా పీకి పారేయొచ్చు”, “గుండెల్లో ధైర్యం...చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు” వంటివి విజిల్స్ వేయించేలా రాసారు. అనిరుధ్ అందించిన పాటలు ఒకటి రెండు తప్పా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు.
హైలెట్స్
సినిమాలో సూర్య , రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమా కోసం సూర్య సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆయనలో తమిళ వాసన ఎక్కడా కనపడకుండా..తడపడకుండా ..అచ్చ తెలుగు నేటివిటితో సాగటం విశేషం. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో తన గ్యాంగ్ తో చేసే రాబరీ సీన్స్ బాగున్నాయి . అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. 1980’ల కాలంలో జరుగుతున్నట్లుగా చూపడానికి దర్శకుడు ,ఆర్ట్ డైరక్టర్ తీసుకున్న జాగ్రత్తలు, వారి కళా నైపుణ్యం మనకు నచ్చుతాయి.
ఫైనల్ థాట్
సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ డబ్బింగ్ సినిమా..సూర్య గత హిట్ చిత్రాలని అయితే తీసుకువచ్చేంత సీన్ అయితే లేదు కానీ ... ఓ సారి సరదాగా చూడచ్చు అనిపిస్తుంది. తీసిపారేసే సినిమా కాదు. ఓ లుక్కేయవచ్చు. వీకెండ్ మంచి కాలక్షేపమే.