విశాల్ 'డిటెక్టివ్' రివ్యూ
వామ్మో ...యమా యాక్టివ్ ... (విశాల్ 'డిటెక్టివ్' రివ్యూ)
ఓ మర్డర్ జరుగుతుంది. లేదా హఠాత్తుగా ఓ మనిషి మాయమై పోతాడు..అదీ కాకపోతే ఓ బ్లాక్ మెయిల్... బాధితులు పాహిమాం..మీరే శరణం అంటూ ఓ ప్రెవేట్ డిటిక్టివ్ ఆశ్రయిస్తారు. ఆయన రంగంలోకి దిగి తన మేధస్సుతో రకరకాల క్లూలు సంపాదించి, అనుమానితుల లిస్ట్ తయారు చేసి వారిని వెంబడించి పట్టుకోబోతాడు. అయితే వాళ్లూరు కుంటారా...డిటెక్టివ్ మరికొద్ది క్షణాల్లో ఫలాన వాళ్లని పట్టుకుంటారు అనగా ..వారిని ఓ కత్తి పోటుతోనో, రివాల్వర్ లోని బుల్లెట్ తోనో కడతేరుస్తూంటారు. దాంతో డిటెక్టివ్ కి మండుకొచ్చి... మరింతగా తన మేథకు పదను పెడతాడు..వాళ్లూ తక్కువ వాళ్లు కాదు కదా... తమ కత్తికు పదును పెట్టి ఈ డిటెక్టెవ్ ని లేపాయాలనుకుంటారు. ఇలా గేమ్ నడిచి, నడిచి చివరకు అసలు దోషులను డిటెక్టివ్ పట్టుకోవటంతో కథ ముగుస్తూంటుంది. ఆ నవలలకు 'మూడు ముద్దులు, ఆరు కత్తి పోట్లు', 'చచ్చి బ్రతికిన మనిషి' , 'ఆరుగురు అనుమానితులు ', 'ఆనకట్ట మీద హత్య ' వంటి పేర్లుతో మార్కెట్లోకు వచ్చి జనాలని అలరించేవి. ఇది ఒకప్పటి అదృష్టవంతులైన పాఠకుల కథ.
కవి సామ్రాట్ విశ్వ నాథ సత్యనారాయణ, ఆరుద్ర,పాలగుమ్మి పద్మరాజుగారు లాంటి వంటి సాహతి ఉద్దండులు సైతం ఈ డిటిక్టివ్ నవలలు రావటం విశేషం. ముఖ్యంగా ప్రముఖ అపరాధ పరిశోధనా నవలా రచయిత.. కొమ్మూరి సాంబశివరావు గారు యుగంధర్ పాత్రతో నడిపించిన డిటిక్టివ్ నవలలు రీసెంట్ గా కూడా మళ్లీ ప్రింట్ అయ్యి...అలరిస్తున్నాయి. అయితే డిటెక్టివ్ నవలలు వచ్చి జనాదరణ పొందినంతగా డిటెక్టివ్ సినిమాలు మాత్రం మనకు రాలేదు. అప్పుడప్పుడూ వచ్చినా అవి నామమాత్రంగానే ఆడాయి. అయితే చాలా రోజుల తర్వాత ఆ లోటు తీర్చటానికా అన్నట్లు విశాల్, మిస్కిన్ కాంబినేషన్ లో ఫక్తు డిటిక్టివ్ సినిమా వచ్చింది. తమిళంలో ‘తుప్పరివాలన్’టైటిల్ తో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజు రిలీజైంది. ఇక్కడ కూడా ఆ సినిమా వర్కవుట్ అవుతుందా..ఈ డిటెక్టివ్ తెలుగు వారికీ నచ్చుతాడా...అసలు ఈ తరం డిటెక్టివ్ కథ ఏంటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
మర్డర్స్ జరగటానికి ముందు,తర్వాత
ఆ రోజు ఎప్పటిలాగే డిటెక్టివ్ అద్వైత్ భూషణ్ (విశాల్)...సరైన కేసు రాలేదనే విసుగులో దుప్పటి ముసుగేసుకుని మంచంపై దొర్లుతున్నాడు. ఈ లోగా ఓ కేసు వచ్చిందని అసెస్టెంట్ మను(ప్రసన్న) వచ్చి నిద్ర లేపాడు. కానీ ఆ కేసులో నిజాయితీ లేదని, ఎంత డబ్బు ఆఫర్ చేసినా తనకు వద్దని రిజెక్ట్ చేసి పంపేసాడు. ఈ లోగా ఓ కుర్రాడు వచ్చి తన కుక్క చనిపోయిందని దాని శరీరంలో బుల్లెట్ దొరికిందని.. దాన్ని ఎవరు చంపారో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. మన డిటెక్టివ్ లో ఉత్సాహం వస్తుంది. ఆ కుక్క చావుకు కారణం కనుక్కుందామని రంగంలోకి దూకుతాడు.
అయితే ఈ కుక్క చావు వెనుక కుక్కచావులు చచ్చిన చాలా మంది తేలతారు. వాటి వెనక పెద్ద స్టోరీ ఉందని, హత్య చేసి వాటిని యాక్సిడెంట్స్ గా చిత్రీకరించే ముఠా ఉందని గ్రహిస్తాడు. ఆ హత్యలెవరు చేశారు? తమ విషయం ఫలానా డిటెక్టెవ్ గమనించారని అవతల వాళ్లూ గ్రహిస్తారు. అప్పుడేం జరుగుతుంది. వాళ్లని అద్వైత ఎలా పట్టుకొన్నాడు? ఆ చావుల వెనక ఉన్న మోటివ్ ని మన డిటెక్టివ్ ఎలా ఛేదించాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఇన్విస్టిగేషన్...
‘సంఘటనల గురించి చెపితే, ఫలితాన్ని ఊహించగల వారు చాలామంది ఉంటారు. కొందరు మాత్రం, ఫలితాన్ని బట్టి, అందుకు దారితీసిన సంఘటనను ఊహించగలుగుతారు’ అంటాడు షెర్లాక్ హోమ్స్. అదే ఆయన నమ్మిన సిద్దాంతం. ఆయన ఓ డిటెక్టివ్.
ఈ సిద్దాంతాన్నే మనసా,వాచా నమ్ముతాడు ఈ సినిమాలో డిటెక్టివ్ కూడా. తన లాజిక్స్ తో క్రైమ్ వెనక ఉన్న రీజన్స్ ని పసిగెడుతూ, ఒక్కో విషయమే ఛేదిస్తూ ముందుకు వెళ్తూంటాడు. మరోసారి షెర్లాక్ హోమ్స్ చెప్పినట్లే...కారణాలలో ఒక్కొక్కదాన్నే కొట్టిపడేస్తుంటే, చివరకు మిగిలేవి ఎంత అసాధ్యంగా కనిపించినా సరే, అవే అసలయిన ఆధారాలు అనేది నిజం చేస్తాడు. పరిస్థితులు ఎంత మామూలుగా కనబడుతుంటే, వాటి వెనుక వివరాలు, అంత లోతుగా ఉంటాయి అని అదే షెర్లాక్ మరోచోట చెప్పినట్లే అన్వేషణ కొనసాగిస్తాడు. అంతలా షెర్లాక్ హోమ్స్ కు నకలు లా ఈ పాత్ర ఉంటుంది. అంతెందుకు ఓ చోట షెర్లాక్ హోమ్స్ పాపులర్ డైలాగు 'మీరంతా చూస్తారు, నేను పరిశీలిస్తాను' అనేది పదాల మార్పుతో యాజటీజ్ గా వాడారు. కాబట్టి షెర్లాక్ హోమ్స్ ని ఫాలో అయ్యేవారికి ఈ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే సస్పెన్స్ గా సాగే ఈ కథ గురించి మరింత వివరణ రాయటం, విశ్లేషణ చేయటం కూడా పద్దతి కాదు. అలా చేస్తే సినిమా చూసేటప్పుడు కిక్ ఉండదు.
అయితే విశాల్ డిటెక్టెవ్ పాత్రను షెర్లాక్ హోమ్స్ కు అనుకరణగా తీసుకున్నా...కథ మాత్రం 2009 లో వచ్చిన హాంకాంగ్ మూవి ఏక్సిడెంట్స్ ని గుర్తు చేస్తూ సాగుతుంది.
యాక్టివే కానీ...
ఫస్టాఫ్ మొత్తం సీరియస్ సెటప్ తో ఏ విషయం క్లియర్ గా చెప్పకుండా సాగుతుంది. ఆ కన్ఫూజన్ తో కాస్త విసుగ్గానే ఉంటుంది. డిటెక్టివ్ నవలలో కనపించే...మొదట సెటప్ లో ఓ సమస్య..దాన్ని డిటెక్టెవ్ ఎలా పరిష్కరించాడు అన్న ధోరణిలో వెళ్లిపోతే..అతన్నే ఫాలో అవుతూ వెళ్లేవాళ్లం. అలా కాకుండా అటు విలన్స్ యాక్టివిటీస్ చూపెడుతూ కన్ఫూజ్ చేసేసాడు. కొన్ని సమయాల్లో తెరపై ఏం జరుగుతోందో కూడా అర్దం కాని సిట్యువేషన్ ఏర్పడుతుంది. చివరి ఇరవై నిముషాలే ..సినిమాలో పూర్తిగా అర్ధమయ్యే భాగం. అలాగే ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిన స్పీడు లేదు. మెల్లిగా స్లోగా జరుగుతూంటుంది.
టెక్నికల్ సపోర్ట్
డిటెక్టివ్ గా విశాల్ ...ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడన్నట్లుగా నటించాడు. మిస్కిన్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందేమీలేదు. ఆయన మాస్టర్ అని చాలా సార్లు ప్రూవైంది. మిగతా విభాగాలు కూడా మిస్కిన్ అడుగుజాడల్లోనే నడిచాయి.
ఫైనల్ థాట్
షెర్లాక్ హోమ్స్ తెలిసిన వాళ్లకు ఈ సినిమా విందు భోజనమే. మరి తెలియనివాళ్లకు...బుర్ర గోక్కుంటూ డైరక్టర్ ని తిట్టుకోవాల్సిందే
ఏమి బాగుంది: కుక్కపిల్ల మర్డర్ తో కథలో మలుపు తీసుకురావటం, సినిమాలో పాటలు లేకపోవటం
ఏం బాగోలేదు: స్లో నేరేషన్ , అర్దం కాని సీన్స్
ఎప్పుడు విసుగెత్తింది : హీరోయిన్ ని సైతం చంపేసినప్పుడు (వీడి అరవ పైత్యం తగలయ్యా అనిపించింది)
చూడచ్చా ?: చూడచ్చు..కాకపోతే మీకు షెర్లాక్ హోమ్స్ తో పరిచయం, ఆరాధన ఉంటే ఇంకా బాగా నచ్చుతుంది. అలాగే అర్దం కాకపోతే మూడు నాలుగు సార్లు చూస్తూ ఒక్కో క్లూ పరిష్కరించుకోవచ్చు..(టిక్కెట్లు దొరక్కపోవటం అనే ఛాన్సే లేదు)